అప్పట్లో హీరోలకు, దర్శకులకు మధ్య మంచి స్నేహం ఉండేది అనే మాట వాస్తవం. ఇప్పుడు అయితే ఒకరిద్దరు హీరోలకు మినహా అలాంటి స్నేహం లేదు అనే చెప్పాలి. ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని, శోభన్ బాబు వంటి హీరోలు దర్శకులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. వారిని చాలా బాగా చూసుకునే వారు. చివరి దశలో వారిని గౌరవించి దర్శకులుగా తమ సినిమాలకు వారి పేర్లు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కెవి రెడ్డి విషయంలో, ఎన్టీఆర్ అలాగే చేసారనే విషయం మనకు తెలిసిందే. కెవి రెడ్డి అనారోగ్యంతో బాధ పడుతూ ఆర్ధిక సమస్యలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. దీనితో ఒక సినిమా విషయంలో… ఎన్టీఆర్ మొత్తం సినిమాను డైరెక్ట్ చేసి… కెవి రెడ్డి పేరు వేసారు. అలాగే దర్శకుడిగా రెమ్యునరేషన్ ఇచ్చారు. కెవి రెడ్డి ఇవ్వాల్సిన బాకీని కూడా మాఫీ చేసారు ఎన్టీఆర్. ఇక కృష్ణ కూడా ఒక దర్శకుడి విషయంలో అలాగే ఉన్నారు.
ఆదుర్తి సుబ్బారావు అని అప్పట్లో మంచి స్టార్ దర్శకుడు. ఆయనతో సినిమా చేస్తే చాలు అని నటులు అనుకునేవారు. మంచి విజన్ ఉన్న దర్శకుడిగా కూడా చెప్తారు. చెన్నైలో 1975 లో ఆయన చనిపోయారు. కృష్ణ… ఆయన్ను గురువుగా భావించేవారు. అప్పుడు గుంటూరులో కృష్ణ.. పాడి పంటలు అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. చెన్నై వెళ్ళడానికి రవాణా అంతగా లేదు. దీనితో హిందూ పత్రికకు ఒక విమానం ఉండేది. వాళ్ళను బ్రతిమిలాడుకుని ఆ విమానంలో చెన్నై వెళ్లి ఆయన్ను చివరి చూపు చూసారు.