తన సినిమాల్లో కృతి శెట్టి ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఆమె నిజ జీవితంలో ఏడవడం ఎప్పుడైనా చూశారా? మరీ ముఖ్యంగా లైవ్ లో ఆమె ఏడవడం చూశారా? అలాంటి సందర్భం రానే వచ్చింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఊహించని ఘటన ఎదురవ్వడంతో.. కృతి షెట్టి షాక్ కు గురైంది. ఆ షాక్ లోనే ఏడుపు అందుకుంది.
తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కు హాజరైంది కృతి. ఆ వెంటనే ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో మహిళా యాంకర్ కృతిని ప్రశ్నలు అడుగుతోంది. కృతి సమాధానాలు చెబుతోంది. కానీ పక్కనే ఉన్న పురుష యాంకర్ కు మాత్రం అవకాశం రాలేదు. దీంతో ఆ యాంకర్ కు కోపం కట్టలు తెంచుకుంది.
“పదే పదే నువ్వే ఇంటర్వ్యూ చేస్తే, నేనెందుకు ఇక్కడ, నన్ను ప్రశ్నలు అడగనివ్వవా, ఇంత కాస్ట్ లీ డ్రెస్ వేసుకొచ్చింది ఎందుకు” అంటూ తన సహ-యాంకర్ పై విరుచుకుపడ్డాడు మరో యాంకర్. దీంతో మహిళా యాంకర్ కు కూడా చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరూ ఓ రేంజ్ లో గొడవకు దిగారు. ఇదంతా చూస్తున్న కృతి షెట్టి ఒక్కసారిగా షాక్ అయింది. బిక్కచచ్చిపోయింది.
ఇద్దరు యాంకర్లు ఒక్కసారిగా గొడవపడ్డం ఆపేశారు. తాము కావాలనే అలా చేశామని ఇదంతా ప్రాంక్ అని అన్నారు. దీంతో అప్పటివరకు షాక్ అయిన కృతికి కన్నీళ్లు ఆగలేదు. స్టేజ్ పైనే ఏడ్చేసింది. ఊహించని ఘటనతో యాంకర్లిద్దరూ షాక్ అయ్యారు. కింద ఉన్న కృతి అసిస్టెంట్ వచ్చి ఆమెకు కర్చీఫ్ అందించాడు. ఆ వెంటనే మేనేజర్ వచ్చి ఇంటర్వ్యూ ఆపేశాడు.
ఎవరైనా గట్టిగా అరిస్తే తనకు భయమని, తట్టుకోలేక ఏడ్చేస్తానని చెప్పుకొచ్చింది కృతి శెట్టి. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో, ఇద్దరు యాంకర్లపై విరుచుకుపడుతున్నారు. ప్రాంక్ చేయడం ఇలానా అంటూ యాంకర్లపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.