ఇండస్ట్రీలోకొచ్చిన అతి తక్కువ టైమ్ లోనే వరుసపెట్టి సినిమాలు చేస్తోంది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బ్యూటీ, కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వాలనుకోలేదు. మంచి కథలు దొరికితే, అన్ని భాషల్లో నటిస్తానని ఇప్పటికే ప్రకటించింది.
ఇందులో భాగంగా తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ది వారియర్ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది కృతి శెట్టి. ఆ తర్వాత అక్కడ మరో 2 సినిమా ఆఫర్లు కొట్టేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ, తన చూపును మలయాళ చిత్ర పరిశ్రమపై పెట్టింది.
మలయాళం నుంచి ఓ పాన్ ఇండియా సినిమా రాబోతోంది. స్టార్ హీరో టొవినో థామస్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారు. కృతికి ఇదే తొలి మలయాళ మూవీ.
పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి, సౌత్ లో బాగా పరిచయమున్న హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాపులరైన కృతి అయితే బాగుంటుందని భావించారు. అలా కృతి మల్లూవుడ్ డెబ్యూ లాక్ అయింది.