అధికారికంగా త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని.. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి మనదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణమంటూ కొనియాడారు. నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై వేడుకలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు.
జల్ జంగల్ జమీన్ నినాదంతో కుమ్రం భీమ్ తెలంగాణ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాంపై తెగించి పోరాడారని,.. అదేవిధంగా తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరాటం చేశారని కేటీఆర్ వెల్లడించారు.
పోరాటయోధుల స్ఫూర్తితో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ మరిచిపోరని చెప్పారు.
నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు.