కంటోన్మెంట్ లో మూసివేసిన రోడ్లను తెరిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు మంత్రి కేటీఆర్. షేక్ పేట ఫ్లై ఓవర్ ను చీఫ్ ఇంజినీర్ చేతుల మీదుగా ఆయన రిబ్బన్ కట్ చేయించారు. ఈ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్. స్కైవేల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా భూములు ఇవ్వట్లేదని చెప్పారు. హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయన్న ఆయన.. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. గడిచిన 75 సంవత్సరాలలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని.. కానీ.. ఈ ఏడేళ్లలో అంతకంటే ఎక్కవ రోడ్లను కేంద్రం నిర్మించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందని.. దానికి సంబంధించిన భూమి త్వరగా సేకరిస్తే తొందరగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
షేక్ పేట ఫ్లైఓవర్ ను రూ.333 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఆరు లేన్లతో టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడలి వరకు 2.8 కిలోమీటర్ల పొడవుతో ఇది నిర్మితమైంది. ఈ వంతెన నిర్మాణంతో మెహదీపట్నం, హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.