– కేటీఆర్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి
– క్విడ్ ప్రో కో ద్వారా బీజేపీ చేరారన్న మంత్రి
– దమ్ముంటే నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే సవాల్
– రాజగోపాల్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన కేటీఆర్
– కేసీఆర్ ఫాంహౌస్ లో యువకుడి మరణంపై ప్రశ్నించిన బీజేపీ అభ్యర్థి
దర్యాప్తు సంస్థల దాడులపై ఈమధ్య మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. బీజేపీ నేతలను ప్రశ్నిస్తూ కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనికి బీజేపీ వర్గాల నుంచి కూడా స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని అన్నారు. 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు దక్కినందుకుకే రాజగోపాల్ బీజేపీలో చేరారని పేర్కొన్నారు. ఇది క్విడ్ ప్రో కో కాక మరేంటని ప్రశ్నించారు.
కేటీఆర్ ట్వీట్ చేసిన దగ్గర నుంచి రాజగోపాల్ వరుసబెట్టి కౌంటర్ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తాను బీజేపీలో చేరేందుకు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వచ్చిందన్న కేటీఆర్ కు సవాల్ విసిరారు. తాను 24 గంటలు టైం ఇస్తున్నానని, క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపణలను నిరూపించు లేదంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా బదులిచ్చారు. అయితే, ఈ సవాల్ తర్వాత కేటీఆర్ తోకముడిచారని అన్నారు రాజగోపాల్.
‘‘ట్విట్టర్ టిల్లు.. నాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేస్తే.. ఆధారాలు లేకపోవడంతో సమాధానం ఇవ్వలేక నా అకౌంట్ బ్లాక్ చేశారు’’ అని టీమ్ రాజన్న పేరుతో ఉన్న ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి.
తాజాగా దర్యాప్తు సంస్తలను ప్రస్తావిస్తూ.. కేటీఆర్, కేసీఆర్ కు చురకలంటించారు రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లోని వ్యవసాయ బావిలో ఆంజనేయులు అనే కూలీ గతేడాది డిసెంబర్ 23 చనిపోయాడు. ఈ ఘటనపై రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ న్యూస్ పేపర్ క్లిప్ ను షేర్ చేస్తూ.. ‘‘కేసీఆర్ ఫాంహౌస్ లో కూలి పని కోసం వచ్చిన యువకుడు ఎలా చనిపోయాడు? ఈత వచ్చిన వ్యక్తి మునిగిపోవటం ఏంటి? ఎందుకంత రహస్యంగా పోస్టుమార్టం పనులు జరిగాయి?’’ అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇందుకేనా తండ్రీ కొడుకులు సీబీఐ, ఈడీ అంటే భయపడేది? అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి.