– బీజేపీ దూకుడు పాలిటిక్స్
– ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్
– చక్రం తిప్పుతున్న సునీల్ బన్సల్
– కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్
– అన్ని సంస్థలను వాడుకుంటున్నారని విమర్శ
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావు టార్గెట్ గా ఈడీ పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో సోదాలు జరిపి ఢిల్లీ కేంద్రంగా కూపీ లాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇటు మరో కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇటు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ దూకుడుగా ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేయాలని చూస్తోంది. ఈమేరకు పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ప్రజా గోసా-బీజేపీ భరోసా, పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాల అమలు వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు.
కొద్ది రోజులుగా బన్సల్ తన చాణక్యాన్ని అమలు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడుకు 15 లోపు నోటిఫికేషన్ ఉంటుందని ఆయన కామెంట్స్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మల్లా ఆడిస్తోందని మండిపడ్డారు. ‘‘ఈసీ (ఎన్నికల కమిషన్) కంటే ముందే.. ఎన్నికల తేదీలను బీజేపీ ప్రకటిస్తోందని మండిపడ్డారు. అలాగే ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కంటే ముందే.. దాడులు ఎదుర్కోబోయే నాయకుల చిట్టాను బీజేపీ వెల్లడిస్తోందన్నారు.
ఇక ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కంటే ముందే.. నిషేధాలు ఎదుర్కోబోయే సంస్థల గురించి బీజేపీ ప్రకటన చేస్తుందని.. ఐటీ (ఆదాయపు పన్ను విభాగం) కంటే ముందే.. దాడుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు గురించి బీజేపీ కామెంట్లు చేస్తుందని.. సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కంటే ముందే.. కేసుల్లోని నిందితుల గురించి బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది’’ అని చురకలంటించారు కేటీఆర్. కేంద్ర సంస్థలను ఈవిధంగా దుర్వినియోగం చేస్తున్న బీజేపీ పేరును మార్చుకోవాలని సూచించారు.
బీజేపీకి కొత్తగా ‘‘బీజే ఈసీ సీబీఐ ఎన్ఐఏ ఐటీ ఈడీ పీ’’ అని నామకరణం చేసుకోవాలన్నారు. ఈ ట్వీట్ కు ఓ పత్రికలో ప్రచురితమైన న్యూస్ క్లిప్ ను కూడా అటాచ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు అక్టోబరు 15లోపు నోటిఫికేషన్ వెలువడుతుందని బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీలో సునీల్ బన్సల్ చేసిన కామెంట్ పై ఇలా వ్యంగ్యంగా స్పందించారు కేటీఆర్. మరోవైపు బీజేపీ అన్ని ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై కూడా ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మునుగోడులో రణనీతి అవలంబించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది బీజేపీ.