నిధుల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. పల్లెల్లో చేస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతో చేస్తుందేనని బీజేపీ అంటుంటే.. నిధుల విషయంలో మోడీ సర్కార్ వివక్ష చూపిస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ నిధుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి తెలంగాణ 3లక్షల 65వేల కోట్లు ఇస్తే.. లక్షా 68వేల కోట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భూత్పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు సవాల్ విసిరారు కేటీఆర్. నిధుల విషయంలో తాను చెప్పింది తప్పని నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. పాలమూరులో 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే పాలమూరులో వలసలు తగ్గాయని.. మంచి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా తమ ప్రభుత్వం ఉంటోందని తెలిపారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తానన్నారని గుర్తు చేశారు. 8 ఏళ్లలో దానికి ఒక్కపైసా కూడా రాలేదన్నారు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదని మండిపడ్డారు.
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ముందుగా దేవరకద్ర మండలం, వెంకంపల్లి వద్ద పేరూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు కేటీఆర్. రూ.55 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. తర్వాత.. అడ్డాకుల మండలం వర్నే-ముత్యాలంపల్లి మధ్య నిర్మించే హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని కోసం రూ.18 కోట్లు వెచ్చించనున్నారు. అనంతరం భూత్పూర్ పట్టణంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నిర్మించే మినీ స్టేడియం, బీటీ రోడ్డు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే భూత్పూర్ పరిధిలోని అమిస్తాపూర్ వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించి కేంద్రంపై విరుచుకుపడ్డారు కేటీఆర్.