ఏపీలోని వైసీపీ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
‘పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు.’ అంటూ ఆయన చెప్పినట్లు కేటీఆర్ వివరించారు.
సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో రాష్ట్రంలో 6 నెలల్లో విద్యుత్ కొరతను తీర్చారన్నారు. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పక్కరాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి అంత చక్కగా ఉందని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారు నిజాలు తెలుసుకోని మాట్లాడాలని కేటీఆర్ హితవుపలికారు. ప్రస్తుతం కేటీఆర్ ప్రసంగాన్ని ఏపీ ప్రతిపక్ష టీడీపీ వైరల్ చేస్తోంది.