– జనరల్ సెక్రెటరీగా పుల్లెల గోపీచంద్
తెలంగాణ బాడ్మింటన్ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఎన్నికయ్యారు. సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని తాజాగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఏకగ్రీవంగా మరోసారి అధ్యక్షునిగా ఎంపిక చేశారు.
బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను జనరల్ సెక్రెటరీగా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్‌గా చాముండేశ్వరినాథ్, ట్రెజరర్‌గా ఫని రావులను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఇతర కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ బాడ్మింటన్ సంఘం ఎన్నికలకు శాట్స్, ఒలంపిక్ సంఘాల నుంచి పరిశీలకులుగా ప్రేమ్ రాజ్, నంద గోకుల్ హాజరయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు వారు తెలిపారు.
క్రీడా సంఘాల్లో రాజకీయాలకు, రాజకీయ నాయకులకు తావు లేదని కేటీఆర్ గతంలో ప్రకటించారని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను సైతం బాడ్మింటన్ సంఘానికి రాజీనామా చేస్తానని చెప్పిన కేటీఆర్..ఇప్పుడు మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడమేంటని కొందరు విమర్శలు చేస్తున్నారు. బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని తప్పుబడుతున్నారు.