నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందుకు ప్రతి నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
సచివాలయ ప్రారంభం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని ఆయన పార్టీ క్యాడర్ కు ఆదేశాలిచ్చారు. జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలన్నారు.ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇన్ చార్జ్ లుగా నియమిస్తామన్నారు.
ఇన్ చార్జీలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు మంత్రి కేటీఆర్. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు..పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఆయన పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. అయితే నూతన సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్.. కేసీఆర్ పుట్టిన రోజున దాన్ని ప్రారంభించాలని చాలా కసరత్తు చేస్తోంది.
మరో వైపు కేసీఆర్ పుట్టిన రోజు నూతన సచివాలయాన్ని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి.. కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది కేసీఆర్ రాచరిక ధోరణికి అద్దం పడుతుందని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇక ఇలా ఉంటే.. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిచ్చింది.