– మతం మంటలు తప్ప బీజేపీ చేసిందేంటి?
– తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటి?
– అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తారా?
– మోడీ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
– మరోసారి ఎర్రబెల్లి.. కేటీఆర్ సీఎం వ్యాఖ్యలు
75 ఏండ్లుగా రైతుల కోసం ఎవరూ ఆలోచించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం కేసీఆర్ మాత్రమే వారి కోసం పరితపిస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పారు కేటీఆర్. కేసీఆర్ లో కే-అంటే కాలువలు, సీ-అంటే చెరువులు, ఆర్-అంటే రిజర్వాయర్లు అని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు ఏమీ చేయలేదన్న కేటీఆర్.. ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వన్ నేషన్- వన్ మార్కెట్, వన్ నేషన్ -వన్ రేషన్ అన్న ప్రధాని వన్ నేషన్-వన్ ఫ్రెండ్ అని దేశంలో దోచుకున్న సంపదను అక్రమ మార్గంలో అదానీ కంపెనీల్లో పెడుతున్నారన్నారు. ఆ అక్రమ డబ్బులతో ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలలో చీలిక తేవడం, ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేయడం పనిగా పెట్టుకున్నారని విరుచుకుపడ్డారు. నల్లధనం వెలికి తీస్తానని చెప్పారని, మరి ఎందుకు తియ్యలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్ తో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం రాక ముందుకు రైతులు, సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ లో ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ములుగు జిల్లాలో గిరిజన యునవర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మరిచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ పని అన్నారు. అనంతరం రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా సీఎం.. సీఎం అని నినాదాలతో హోరోత్తించారు.