కేంద్రంపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణను అవహేళన చేసిన కాషాయ పార్టీ నేతల తోకలు కత్తిరించాలని ఆయన అన్నారు. నల్లచట్టాలు, విద్యుత్ సంస్కరణల పేరిట మీటర్లు, ప్రైవేట్ ధాన్యం సేకరణకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అందువల్ల రైతు వ్యతిరేకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేశారని, కానీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ చెప్పి రైతులను మోడీ వంచించారని ఆయన మండిపడ్డారు. మోడీ సర్కార్ పాలనలో కేవలం ఒక్కరిద్దరు వ్యక్తుల సంపాదన మాత్రమే పెరిగిందన్నారు.
ఒకరిద్దరు వ్యక్తుల సంపాదన పెరిగితే పెరిగితే దేశం బాగుపడినట్లు కాదన్నారు. కేంద్రం రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు రూ.18 వేల కోట్లు ఇవ్వాలని తాము చెప్పామని పేర్కొన్నారు. రైతులందరూ చైతన్యవంతులైనపుడే కేంద్రం ఏకపక్ష విధానాలకు కత్తెర పడుతుందని ఆయన తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో మన్నెగూడలో రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సాగురంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతోందని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా నల్గొండకు నిధులిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటామని ఆయన మరోసారి చెప్పారు. రాష్ట్రంలో సంపదను పెంచి రైతులకు తమ ప్రభుత్వం పంచిందన్నారు.