విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశాన్ని అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్నారు. ఎన్డీసీ, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా కేంద్రం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో సీసీఐని పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక, సాఫ్ట్వేర్ రంగంలోని మార్పులను దేశం అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని కేంద్రం సత్వరమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.