కేంద్రంలోని బీజేపీ హైదరాబాద్‌కు పైసా సాయం కూడా చేయడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కావాలని ఏడేళ్లుగా అడుగుతున్నా.. కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్కైవేల నిర్మాణానికి కేంద్రం భూములు ఇస్తే.. వాటికి డబ్బు రూపంలో గాని.. మరో చోట భూమి రూపంలో కానీ.. పరిహారం చెల్లిస్తామని చెప్పామని అన్నారు. ఇరవై సార్లు అడిగినా కేంద్రం నుంచి స్పందన కరువైందని మండిపాడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 7,800 కోట్లు కోరామని చెప్పారు. తెలంగాణను చిన్న చూపు చూస్తున్న కేంద్రం.. గుజరాత్‌కు మాత్రం వరద సాయం చూస్తుందని ఆరోపించారు.
ఈ బడ్జెట్‌లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తుందేమో చూడాలని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం దుర్నీతి, వివక్షను ప్రజలకు అర్థం అయ్యేలా చెబుతామని చెప్పారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. వచ్చే 30 ఏళ్లలో ఇంకా పెరుగుతోందని చెప్పారు. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నాం. శివారులోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలుగా మారాయని అన్నారు.
గతంలో ఉన్న తాగునీటి సమస్య ఇప్పుడు హైదరాబాద్ లో లేదని అన్నారు. నగరవాసులకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా.. అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59ని మళ్లీ తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో రూ. 5 వేల కోట్లతో రెండు స్కైవేలను నిర్మించే యోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉందని చెప్పారు. బాచుపల్లి, బషీరాబాద్, కూకట్‌పల్లిలో పర్యటించారు.