బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ పై వేటు పడింది. చినసారు కంట్లో పడాలని చేసిన అత్యుత్సాహం చివరకు ఆయన మెడకే చుట్టుకుంది. దీనిపై మంత్రి సైతం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 24వ తేదీన మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. భారీ వర్షాల కారణంగా తన బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని.. పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు. ఆయన కూడా వేడుకలకు దూరంగానే ఉన్నారు. కానీ.. ఆయన మాట లెక్కచేయకుండా కొందరు టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ విషయం అటుంచితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ చేసిన పనే చర్చనీయాంశమైంది.
24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదని నలుగురు సిబ్బందికి మెమో జారీ చేశారు కమిషనర్. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కింది. గంగాధర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబడుతూ.. కేటీఆర్ పై అంత అభిమానం ఉంటే టీఆర్ఎస్ లో చేరాలని మండిపడ్డారు.
Advertisements
ఎట్టకేలకు ఈ విషయం కేటీఆర్ చెవిన పడింది. సదరు అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమిషనర్ ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాజకీయాలు, పరిపాలనలో సైకో ఫ్యాన్సీని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తినని ట్వీట్ చేశారు కేటీఆర్.