తెలంగాణ మంత్రి కేటీఆర్.. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ రికార్డుపై మనసు పడినట్టు ఉన్నారు. కేటీఆర్ ఏంటీ? దత్తాత్రేయ రికార్డుపై మనసు పడటం ఏంటి అనుకుంటున్నారా? బీజేపీ నాయకుడుగా ఉన్న సమయంలో దత్తాత్రేయకు ఓ అరుదైన రికార్డు ఉంది. ప్రజల సమస్యలపై, పరిపాలన అంశాలపై ప్రభుత్వానికి ఆయన వరుసగా లేఖలు రాసేవారు.
ఇలా 100 లేఖలు రాసి ఓ రికార్డుని క్రియేట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సెంచరీ కొట్టిన ఆయన మీడియా ప్రతినిధులకు విందు కూడా ఇచ్చారు. అప్పట్లో అదో పెద్ద వార్త అయింది. ఇప్పుడు దత్తాత్రేయ రికార్డుపై కేటీఆర్ మనసు పారేసుకున్నారని ఆయనకు బాగా తెలిసినవారు అంటున్నారు. ఇటీవల మంత్రి వరుసపెట్టి కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.
త్వరలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై కూడా ఆయన రోజుకో లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేఖలు రాస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ కంకణం కట్టుకున్నారని గులాబీ తమ్ముళ్లు అంటున్నారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
కేటీఆర్ కష్టపడి దత్తాత్రేయ రికార్డు బ్రేక్ చేస్తారని కొందరు.. రికార్డులు కోసం పెద్దగా కష్టపడకుండా లేఖలు రాస్తున్నారని మరికొందరు.. ఏమైనా ఐటీ మంత్రికి వచ్చే ఆలోచనలే వేరబ్బా అంటూ ఇంకొందరు.. ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్ ద్వారా ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించినపడు కూడా నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు తాజాగా లేఖలు రాయడంపై కూడా సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.