తెలంగాణ పథకాలను కేంద్రం ఫాలో అవుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు మంచినీటి కోసం ఎక్కడ చూసినా బిందెలతో పెద్ద లైన్లు కనిపించేవన్నారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు.
ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీలకు, కాలనీలకు మంచి నీటి సరఫరా కోసం ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నామని చెప్పారు కేటీఆర్. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని.. రైతుబంధుని మనం ప్రారంభించిన తర్వాత దేశంలోని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని వివరించారు.
అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి తాగునీరు కూడా సరఫరా చేస్తామని తెలిపారు. కొండపోచమ్మసాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది కేసీఆర్ ఆలోచన అని వివరించారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే నగరంతో కలిసిపోయాయని చెప్పారు. కార్పొరేషన్ లో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తామన్నారు. రూ.1200 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్ పరిధిలోని ఇళ్లకు నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు కేటీఆర్.