సీఎం కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దళిత గిరిజన దండోరా పేరుతో కాంగ్రెస్ శ్రేణులు వారం రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా అంటూ ఊరూరా సానుకూల వాతావరణం కనపడుతుండటంతో టీఆర్ఎస్ కుట్రలకు తెరలేపిందని మూడు రోజులుగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తూనే ఉన్నాయి.
ఓవైపు సర్పంచ్ లను పిలిపించుకొని మీ ఊర్లో నుండి ఒక్కరు కూడా మీటింగ్ కు వెళ్లకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ నేతలు చెప్పటం, గతంలో కేసులున్న వారిపై పోలీసులతో ఒత్తిడి చేయించటం, మీటింగ్ లకు రాకుండా స్థానికులు ఎవరూ వాహనాలు ఇవ్వకుండా ప్రయత్నించటం, మీటింగ్ రోజునే హరీష్ రావు హుజురాబాద్ నుండి వచ్చి గజ్వేల్ లో పర్యటించటంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ కనీసం 500మందికి విందులు ఏర్పాటు చేయటం అన్నీ సభను అడ్డుకునే కుట్ర అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
Advertisements
అయితే, కాంగ్రెస్ గజ్వేల్ సభకు ఒక్క రోజు ముందు కేటీఆర్ నడిపిన కోవర్టు రాజకీయం తమను మానసికంగా ఇబ్బంది పెట్టదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆడియో క్లిప్ లను దొంగతనంగా రికార్డు చేయించి, కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసి… మల్లిఖార్జున ఖర్గే వంటి సీనియర్ నేతలను సభకు రాకుండా వేసిన మైండ్ గేమ్స్ పనిచేయవని స్పష్టం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అని… ఎన్ని విమర్శించుకున్నా తమంతా ఒక్కటే అని, గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా పాతి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.