మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడిగా కొనసాగుతుండటం, నియోజక వర్గంలో ప్రజలతో మమేకమై వుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయన అభ్యర్థిత్వం వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు.
స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం, సర్వే రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఆయనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని లింగవారి గూడెం.
నల్గొండలోని నాగార్జన కాలేజ్ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. బీఎడ్ చేసి కొంత కాలం టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత 2002లో కేసీఆర్ పిలుపు మేరకు స్వరాష్ట్ర ఉద్యమంలోకి వచ్చారు. ఆ తర్వాత 2003 నుంచి పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో మరోసారి ఓటమి పాలయ్యారు.
అంతకు ముందు అభ్యర్థిగా కూసుకుంట్లను ప్రకటించే ముందు ప్రగతి భవన్ లో పార్టీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న వారందరితో ఆయన సమావేశం జరిపారు. అందరి అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
స్థానిక నేతలు, జిల్లా నాయకులు, సర్వే రిపోర్టుల ఆధారంగా చేసుకుని కూసుమంచిని ఫైనల్ చేశారు. ప్రగతి భవన్ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సా గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఇతరులు పాల్గొన్నారు.