తెలంగాణ నేతన్నల కడుపును కేంద్రం కొడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అధిక మందికి చేనేత రంగం ఉపాధి కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి టెక్స్ టైల్ రంగాన్ని మోడీ సర్కార్ పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో టెక్స్ టైల్, చేనేత రంగాలకు ప్రోత్సాహం కల్పించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను ఆయన కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. టెక్స్ టైల్, చేనేత రంగాలకు చెందిన పలు అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు.
శుష్క వాగ్దానాలు–రిక్త హస్తాలు అన్నట్టుగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అసత్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర టెక్స్ టైల్, చేనేత కార్మికులకు కేంద్రం నయా పైసా అదనపు సహాయాన్ని చేయలేదని ఆరోపించారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం తాము ఉద్యమించామని, అధికారంలోకి వచ్చిన తాము ఈ ఎనిమిది ఏండ్ల నుంచి టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు.