దేశంలో ఎక్కడాలేని విధంగా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చామన్నారు మంత్రి కేటీఆర్. నగరంలోని ఇందిరా నగర్ లో నిర్మించిన 210 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
మరో వారం రోజుల్లో కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు కేటీఆర్. నగరం నడిబొడ్డున ఖైరతాబాద్ లో స్థలం దొరకాలంటేనే లక్షల ఖర్చు అవుతుందని.. అలాంటిది ఇళ్లను నిర్మించి ఇచ్చామని చెప్పారు.
ఇందిరా నగర్ లో రూ.17.85 కోట్లతో జీ+5 అంతస్తులో 5 బ్లాక్ లలో జీహెచ్‌ఎంసీ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిందన్నారు కేటీఆర్. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్న ఆయన.. రోజు రోజుకి హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
రూ.9,714 కోట్లతో నగరంలో పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నామని చెప్పారు మంత్రి. ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వొద్దని సూచించారు. అందరి సమక్షంలోనే లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.18 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నట్లు వివరించారు.