బీజేపీ నేత,దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్, కేటీఆర్ ల పై విమర్శల వర్షాన్ని కురిపించారు. గత 8 ఏళ్ళుగా రైతులను పట్టించుకోని కేసీఆర్ ఇది ఎన్నికల నామ సంవత్సరం కావడంతోనే రైతులు గుర్తొచ్చారని మండిపడ్డారు. నిండు సభలో కౌలు లేదు.. కౌలు రైతు లేరన్న కేసీఆర్ కు ఇప్పుడెందుకు కౌలు రైతులపై ప్రేమ వచ్చిందని ప్రశ్నించారు.
రైతులకు సహాయం చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని కేసీఆర్ చేసిన విమర్శలు అర్థరహితమని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ ఇంకా ఎస్డీఆర్ఎఫ్ అంటే ఏంటో ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల సాయం ప్రకటించారని.. వాటిని ఎస్ డీఆర్ఎఫ్ నుంచే ఇస్తారని రఘునందన్ తెలిపారు.
ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో కేంద్రం వాటా 75 శాతం ఉంటుందని.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్ కు కేంద్రం 3 వేల కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై కేటీఆరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ నుంచి సమాచారం లీకైనా కేటీఆర్ దే నైతిక బాధ్యత అని రఘునందన్ రావు అన్నారు.
పేపర్ లీకేజీ పై విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నారు కాబట్టే.. కేటీఆర్ ను రాజీనామా అడుగుతున్నామని ఆయన అన్నారు. ఇక పేపర్ లీకేజీ విషయంలో ప్రజల దృష్టిని మార్చేందుకే కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు.