రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదన్నారు మంత్రి కేటీఆర్. నల్గొండలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేశారాయన. రాష్ర్టం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని చెప్పారు. నల్గొండను ఏ పాలకులు పట్టించుకోలేదన్న కేటీఆర్.. 65 ఏళ్లుగా పరిష్కారం కాని ఫ్లోరోసిస్ సమస్యకు తాము ఆరేళ్లలోనే పరిష్కరించామని తెలిపారు. సూర్యాపేట, నల్గొండకు మెడికల్ కాలేజ్ లు, భువనగిరిలో ఎయిమ్స్ నెలకొల్పామన్నారు.
రాబోయే 18 నెలల్లో నల్గొండ రూపురేఖలు మార్చేస్తామన్నారు కేటీఆర్. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ లతో పాటు నల్గొండ యువతకు కొలువులు వచ్చేలా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఐటీ హబ్ తోపాటు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వివిధ కంపెనీలను తీసుకొచ్చి 16వందలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి.