పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో విమర్శలు చేస్తున్న కేటీఆర్.. తాజాగా బహిరంగ లేఖతో సెటైర్లు వేశారు. పెట్రోల్ ధరల పెంపుతో ప్రతీ రోజూ ప్రజల రక్తం పీలుస్తున్న కేంద్రం తీరును ఈ లేఖ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారు కదా… ఈ దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ముడిచమురు ధరలు పెంచడమే కేంద్రం పనిగా పెట్టుకుందన్న కేటీఆర్.. బీజేపీ అసమర్థ విధానాలే ఈ దుస్థితికి కారణమని విమర్శించారు. పన్నులు పెంచడమే పరిపాలనగా కేంద్రం భ్రమిస్తోందని.. దేశ ప్రజలపై రూ.26.51 లక్షల కోట్ల భారం పడుతోందని వివరించారు.
ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే..ఇంకోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగట్టిందని మండిపడ్డారు. నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా బలాదూర్ గా తిరిగొస్తుందని అన్నారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్ను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు.
దోపిడీనే లక్ష్యంగా చేసుకుని పీఎం పెట్రో పన్ను యోజన పథకం తెచ్చారంటూ చురకలంటించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు కొట్టుకునే మోడీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందన్నారు. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని ప్రధాని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.