కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దేశంలో వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్ పరికరాలపై జీఎస్టీని తగ్గించాలని లేఖలో ఆయన కోరారు. ఆయన లేఖలో కోరారు. తెలంగాణతో పాటు దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
వైద్య పరికరాలు విలాసవంతమైన వస్తువులు కావని పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్యం అందడంలో డయాగ్నోస్టిక్స్ కూడా కీలకమని గుర్తించాలని సూచించారు. దేశంలో వైద్య పరికరాలపై 12 శాతం, డయాగ్నోస్టిక్స్ పరికరాలపై 18 శాతం విధిస్తున్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు.
పరిశ్రమలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వాటిపై కేంద్రం సానుకూల చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్తుతం వైద్య పరికరాల విడిభాగాలపై కస్టమ్ డ్యూటీతో పాటు అదనంగా జీఎస్టీని ఎక్కువ రేటుతో వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఫలితంగా దేశంలో వైద్య ఉపకరణాల ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పైగా ఆరోగ్య రంగంలో జీఎస్టీపై తిరిగి చెల్లించే విధానం అమల్లో లేదని, అందువల్ల ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా పరిణమిస్తోందని లేఖలో వివరించారు. దేశంలో మెడికల్ ఎక్విప్ మెంట్ప్ కు సంబంధించి ముడిసరకులను ప్రస్తుతం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవలసి వస్తోందన్నారు. ఆ పరికరాలు భారత్ కు వచ్చేందుకు చాలా అధిక సమయం పడుతోందన్నారు.
వాటిని నిల్వ చేయడం కూడా పెద్ద సవాలుగా మారుతోందని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. ఎలక్ట్రానిక్ భాగాలు, మానిటర్లు, ప్యానెల్ డిస్‌ప్లే యూనిట్లు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు తదితర వైద్య పరికరాల కోసం విడిభాగాల తయారీలో దేశీయకరణను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.