గులాబ్ తుపాను ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో చూశాం. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఆఖరికి మంత్రి కేటీఆర్ ఇలాకాలోని కలెక్టరేట్ కూడా మునిగిపోయింది. అయితే.. గులాబ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం వదిలినా.. వరద నీరు మాత్రం కొన్ని కాలనీలను వదలలేదు. దీంతో కొందరు వినూత్న నిరసన చేపట్టారు.
వరద నీరు బయటకు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో చాలా ఇళ్లు నీళ్లల్లో నానుతున్నాయి. గులాబ్ ఇంత భీభత్సం సృష్టించినా.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నగరవాసులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ మిస్సింగ్ పేరుతో పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.
ప్రస్తుతం కేటీఆర్ మిస్సింగ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఓ వీడియోను తెగ ఫార్వార్డ్ చేస్తున్నారు.