ఈమధ్య కాలంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా మంత్రి కేటీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదనే అంశాన్ని హైలైట్ చేస్తూ.. రాష్ట్ర నేతలకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. మరోసారి బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రూ.615 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. రూ.410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులు, 24 గంటల నీటి సరఫరా పైలాన్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని బండి సంజయ్ ఏనాడైనా అడిగారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటైనా అమలు చేశారా? అని మండిపడ్డారు. ఒక్క మత పిచ్చి తప్ప బీజేపీ నేతలు రాష్ట్రానికి చేసిందేంటని నిలదీశారు కేటీఆర్. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోరితే కేంద్రం మొండిచేయి చూపించిందని గుర్తు చేశారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలా ఎంపీగా గెల్చిన సంజయ్.. దమ్ముంటే ఈసారి గంగులపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలన్నారు. మూడేళ్ళు అవుతున్నా మూడు కోట్ల పని అయినా చేశారా అని ప్రశ్నించారు.
సంక్షేమ ఫలాలు అందించి ప్రజల మనసు గెలవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తుంటే బీజేపీ ఏం చేసిందని అడిగారు. వైద్య కళాశాలలు, ట్రిపుల్ ఐటీ సంస్థలు ఏమైనా తీసుకువచ్చారా? అంటూ ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న బండి.. కరీంనగర్ లో ఉంది డబుల్ ఇంజన్లే కదా ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.