కేంద్ర బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని.. కేంద్రం రాష్ట్రంపై వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికి వచ్చేది ఒక్కటీ లేదని విమర్శించారు.
పట్టణాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు కేటీఆర్. రూ.487 కోట్ల వ్యయంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మేడ్చల్ జిల్లాలో 3 దశల్లో 50వేల నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. మరో రూ.308 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
మేడ్చల్ లోని 50 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతామని హామీ ఇచ్చారు కేటీఆర్. గతంలో సర్కార్ దవాఖానకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని.. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విదేశీ విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని వెల్లడించారు.
జవహర్ నగర్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 58 జీవోను త్వరలోనే అమలు చేసి పేదలందరికీ పట్టాలు ఇస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ నుంచి వాసన రాకుండా రూ.147 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ చేసినట్లు వివరించారు కేటీఆర్.