ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలే ఉన్నాయని, కానీ కృష్ణా నదీ జలాల విషయంలో రాజీపడబోమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంలో తమ వాదనలను గట్టిగా వినిపిస్తామన్నారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించిన ఆయన పలు విషయాలపై నెటిజన్లకు సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలున్నాయని… ప్రజలు ప్రభుత్వ దవఖానాలకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 23వేల కరోనా టెస్టులు జరుగుతుండగా, వాటిని త్వరలోనే 40వేలకు పెంచబోతున్నామన్నారు. అయితే కరోనా టెస్టుల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకోకుండా ఐసీఎంఆర్, డబ్లుహెచ్వో నిబంధనల మేరకు నడుచుకుంటామని వెల్లడించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి లేదా ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని పలువరు నెటిజన్లు కోరగా… ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీయే మంచి పథకమన్నారు. కరోనా వ్యాక్సిన్ రావటానికి మరో 6 నుండి 9నెలలు పట్టే అవకాశం ఉందని కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు వెల్లడించారు.