తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. శంషాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. రూ. 1200 కోట్ల పెట్టుబడితో ఈ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నగరంలో శాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని వివరించారు. శాఫ్రాన్ నిర్ణయం హైదరాబాద్ పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ప్రపంచస్థాయి సంస్థ భారత్ లో ఏర్పాటు చేసే మొదటి ఇంజన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు కేటీఆర్. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని.. ఆవిష్కరణల కోసం టీ హబ్ వంటి ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు.
ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ కు తిరుగులేదని.. వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పెట్టుబడిదారులే తెలంగాణకు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారని గుర్తు చేశారు కేటీఆర్.