టీఎస్పీఎస్సీ పరీక్ష రద్దుతో తీవ్ర మనస్తాపం చెంది అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నవీన్ తండ్రితో ఈ రోజు కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. తన కుటుంబాన్ని ఆదుకుంటామని అతనికి హామీ ఇచ్చారు. నవీన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. కాగా, నిన్న టీఎస్పీఎస్సీ ఒక్కసారిగా కొన్ని పరీక్షలను రద్దు చేసింది.
ఇది నిరుద్యోగుల గుండెల్లో ఆందోళనను కలిగించింది. ఓ నిరుద్యోగి ఈ విషయం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికె నవీన్ కుమార్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
నవీన్ హైదరాబాద్ లో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేశాడు. తను అర్హత కలిగిన అన్ని పోటీ పరీక్షలను రాస్తుండేవాడు. పలు ఉద్యోగాలు సాధించాలని ప్రయత్నించాడు. ఇటీవల జరిగిన గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూనే సాప్ట్ వేర్ రంగంలోనైనా జాబ్ సంపాదించాలని యత్నించాడు.చివరికి ఏ ఉద్యోగం రాలేనందున మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయం మరింత మానసిక క్షోభకు గురి చేసింది. తన ఇంట్లోనే దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఉరివేసుకునే ముందు సూసైట్ నోట్ రాసి చనిపోయాడు. ఆ లేఖలో ఉద్యోగం లేని జీవితం వృధా అని రాశాడు. నవీన్ మృత దేహాన్ని పోలీసులు శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.