రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాపండుగలో పాల్గొనాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రెటరీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి.
ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రతీ గ్రామంలో ఉదయం 9గంటలకు ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లోని బస్తీలు వార్డ్ కమిటీల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలని సూచించారు.
జెండా పండుగకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందే పూర్తి చేసుకోవాలన్నారు. కేవలం పార్టీ పంపించిన పాస్ ఉన్న వారికి మాత్రమే ఆహ్వానం ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. ఇప్పటి నుంచే పార్టీ నిర్దేశించిన ప్రతినిధులకు పాసులు అందినవో, లేవో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైన ఉందని గుర్తు చేశారు.
ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పార్టీని సంప్రదించాలన్నారు. దీంతోపాటు సరైన సమయానికి సభ ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రవాణా, వాహన సదుపాయాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను ఒకసారి పర్యవేక్షించాలని ఆదేశించారు కేటీఆర్.