డ్రగ్స్ ఇష్యూలోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను కావాలనే లాగుతున్నారని… తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ.. మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్టపరిహారంతోపాటు చర్యలు తీసుకోవాలని కోరారు.
కేటీఆర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏంటి..?
పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ మొత్తం 8 డాక్యుమెంట్స్ ను ఫోటోల రూపంలో పేర్కొన్నారు. వాటితోపాటు కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్స్, కొన్ని వెబ్ సైట్లలోని న్యూస్ లింక్స్ ను జత చేశారు.
డాక్యుమెంట్- 1
ఇందులో తాను ఉత్తమ పనితీరు గల ఐటీ మంత్రిగా… తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ ఇ-గవర్నెన్స్ పురస్కారం లభించిందని చూపించే వార్తాపత్రిక కథనం కాపీని జత చేశారు.
డాక్యుమెంట్- 2
రెండో డాక్యుమెంట్ లో కేటీఆర్ 2015-16కు గాను ది స్కోచ్ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందిన వార్తాపత్రిక కథనం కాపీని ఉంచారు.
డాక్యుమెంట్- 3
ఇందులో ది ఆడి రిట్జ్ ఐకాన్ అవార్డు ప్రదానం చేసిన వార్తాపత్రిక కథనం కాపీని జత చేశారు కేటీఆర్.
డాక్యుమెంట్- 4
ఈనెల 15న బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తనను డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నట్లుగా ఉన్న యూట్యూబ్ లింక్ ను చూపించారు. మిలియన్ల మంది ఈ వీడియోను చూశారని చెప్పారు. దానికంటే ముందు పిటిషన్ లో ఆగస్టు 27న రేవంత్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వ్యాఖ్యల్ని హైలెట్ చేశారు. కేటీఆర్ గోవా వెళ్లి ఏం చేశారంటూ రేవంత్ అన్న మాటలను పిటిషన్ లో తెలుగులోనే పేర్కొన్నారు.
డాక్యుమెంట్- 5
రేవంత్ చేసిన డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ పత్రికలు, మీడియాలో తన పరువు పోయిందంటూ… ఓ వెబ్ సైట్ ఆర్టికల్ ను జత చేశారు కేటీఆర్. ఎలాంటి రుజువు లేకుండా తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొన్నారు.
డాక్యుమెంట్- 6
2017 అక్టోబర్ 27న కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారని… రేవంత్ అన్నట్లుగా ఉన్న వెబ్ సైట్ వార్తకు సంబంధించిన లింక్ ను పేర్కొన్నారు.
డాక్యుమెంట్- 7
ఈనెల 16న జరిగిన బహిరంగ సభలో తాను మత్తులో ఉన్నానని రేవంత్ అన్నదానికి సంబంధించిన ఓ వెబ్ సైట్ లింక్ ను జత చేశారు. అలాగే పిటిషన్ లో రేవంత్ చేసిన ఓ ట్వీట్ ను హైలెట్ చేశారు. అందులో అబద్ధాలకోరు, దోపిడీదారు అని ఉంది. పైగా తనను ట్యాగ్ చేశారని పేర్కొన్నారు కేటీఆర్.
డాక్యుమెంట్-8
తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్, గూగుల్ లో విస్తృతంగా ఉన్నాయని… వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ ల కాపీలను జత చేశారు కేటీఆర్.
ఈ డాక్యుమెంట్స్ తోపాటు ఇంకొన్ని యూట్యూబ్ వీడియోలు, వెబ్ సైట్స్ లింక్స్ ను జత చేస్తూ రేవంత్ చేసిన కామెంట్స్, ట్వీట్స్ ఆధారంగా పిటిషన్ వేశారు కేటీఆర్. అయితే ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. దానితోపాటు జత చేసిన ఆధారాలు సరిగ్గా లేవంటూ కోర్టు విచారణ అర్హత లేదని స్పష్టంచేసింది. దీంతో పూర్తి ఆధారాలతో మంగళవారం మరో పిటిషన్ వేస్తామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
నిజానికి ఇద్దరు రాజకీయ నాయకులు ఆరోపణలు చేసుకోవడం కామన్. ఒకరినొకరు విమర్శించుకోవడం.. కౌంటర్లు వేసుకోవడం సహజంగానే జరుగుతుంటాయి. మరి.. ఇలా రాజకీయంగా ఆరోపణలు చేసిన దానికి కోర్టు అంగీకారం తెలుపుతుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. పైగా యూట్యూబ్ లో ఉండే వీడియోల లింక్స్ ను, వెబ్ సైట్లలో రాసిన వాటిని ఆధారాలుగా కోర్టు స్వీకరిస్తుందా..? ఇప్పుడు సమర్పించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని చెప్పింది. మరి.. కేటీఆర్ ఇంకెలాంటి ఆధారాలతో మంగళవారం పిటిషన్ వేయనున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.