టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సమీక్ష అనంతరం బీఆర్కే భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశాలతో రివ్యూ చేశామని.. నిపుణులతో చర్చించామని తెలిపారు. కాలానుగుణంగా సాంకేతికతను జోడించి టీఎస్పీఎస్సీ పురోగమిస్తోందన్న ఆయన.. కమిషన్ లో పనిచేసే ఇద్దరు చేసిన తప్పు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందన్నారు. ఇది వ్యవస్థ తప్పు కాదని.. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పని వివరించారు.
ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డే కాదు ఈ వ్యవహారంలో ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు కేటీఆర్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత తమపై ఉందన్నారు. లక్షల మంది పిల్లలకు ఇబ్బంది కలగకూడదని చెప్పారు. ఏకకాలంలో 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్పీఎస్సీకి ఉందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 155 నోటీఫికేషన్లు టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చామన్నారు. 37వేల ఉద్యోగాలు కమిషన్ ద్వారా భర్తీ చేశామని.. దేశంలోనే టీఎస్పీఎస్సీకి అత్యుత్తమ కమిషన్ గా పేరుందని తెలిపారు.
నిరుద్యోగులు అధైర్యపడవద్దన్న కేటీఆర్.. అడ్డగోలు వ్యాఖ్యలు చేసేవారిని నమ్మవద్దని సూచించారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని.. దీని వెనుక కుట్ర కోణం ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తే నిందితుడని.. నోటిఫికేషన్లే కుట్ర అన్న బీజేపీ పాత్రపై అనుమానం ఉందన్నారు. క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందేమో అని డౌట్ వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు కేటీఆర్. కానీ, కొందరు చిలవలు పలవలు చేసి చూపిస్తున్నారని.. రాజకీయ నిరుద్యోగులే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. యువత కోసం ప్రభుత్వం పని చేస్తోందని.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దన్న కేటీఆర్.. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
ఉద్యోగాల గురించి బీజేపీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ.. ప్రభుత్వ పాత్ర ఉండదని తెలిపారు. అయినా.. దీనికి, ఐటీ మంత్రికి ఏం సంబంధమని అడిగిన ఆయన.. అసలు, ఐటీ మంత్రి ఏం చేస్తారో తెలుసా? అని ప్రశ్నించారు. తననెందుకు బర్తరఫ్ చేయాలని.. వ్యాపం స్కామ్ లో ఎంతమందిని బర్తరఫ్ చేశారని నిలదీశారు. అభ్యర్థులకు కష్టమే అయినా పరీక్షలు రద్దు చేశామని.. ఇద్దరు వ్యక్తుల తప్పు వల్ల లక్షల మందికి సమస్య వచ్చిందని అన్నారు. అభ్యర్థులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని.. ఆందోళనల పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని వాళ్ల ట్రాప్ లో పడొద్దని సూచించారు కేటీఆర్.