అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తుండగా.. బీఆర్ఎస్ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మంత్రి కేటీఆర్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. దర్యాప్తు చేసే దమ్ముందా అంటూ సవాల్ విసురుతున్నారు.
తాజాగా ‘‘1992-ఏ స్కామ్ అనే ఒక వెబ్ సిరీస్ చూశాను. అందులో ఇద్దరు గుజరాతీ బ్రదర్స్ దేశవ్యాప్తంగా బైక్ రైడ్ చేశారు. వారు వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేది మనమంతా ఇప్పుడు చూస్తున్నాం. చరిత్ర ఎప్పుడూ పునరావృతం కాదని ఈ ఘటన నిరూపితమైంది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ, అదానీ గురించే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.
ఎందుకంటే.. శనివారం డైరెక్ట్ గానే అదానీ గ్రూప్ పై ట్వీట్ చేశారు. ‘‘హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ షేర్లను కుదిపేస్తుండడంతో.. ఈ గ్రూప్ స్టాకుల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి? ఆ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు?’’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
కొద్ది రోజుల క్రితం కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనిపై కథనాలు రాయదని, ఎలాంటి టీవీ డిబేట్స్ ఉండబోవని, చివరికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కూడా ప్రస్తావనకు రాదని అన్నారు. పైగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ నివేదికను తొలగించే పనిలో ఎన్డీఏ ప్రభుత్వం నిమగ్నమై ఉంటుందని చెప్పారు. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఈడీ, సీబీఐ, ఐటీతో దర్యాప్తు చేయించగలదా? అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తు చేసే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు.