కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం అంటూ.. 2001, మేలో కరీంనగర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అప్పట్లో ప్రచురితమైన ఓ వార్త క్లిప్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మహాత్మాగాంధీ చూపిన బాటలో రాష్ట్ర సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆ క్లిప్ కు ట్యాగ్ చేసి రాశారు.
తొలుత వారు పట్టించుకోరు.. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు.. అనంతరం నీతో గొడవపడతారు.. అయినప్పటికీ తుది విజయం నీదే.. అంటూ మహాత్మా గాంధీ సూక్తులను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోందన్నారు.
గాంధీ చెప్పినట్లుగానే మొదట కేసీఆర్ చేసిన ప్రకటనను చాలా మంది రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ఆనాడు కేసీఆర్ అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కానీ.. అప్పుడు కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను రాజకీయ ప్రత్యర్థులు అవహేళన చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడుదామని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్థుల నుంచి మళ్లీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.