కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగిస్తోందని మరోసారి రుజువైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం.. యథావిధిగా గుజరాత్‌కు తరలిపోయిందని మండిపడ్డారు.
సంప్రదాయ వైద్య కేంద్రంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ.. ఈ విషయాన్ని ఇటీవల మరోసారి తెరపైకి తీసుకువచ్చారు కేటీఆర్. బీజేపీ పాలనలో ఆక్సిజన్ నుంచి బొగ్గు వరకు అన్ని కొరతేనని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
బొగ్గు కొరత వల్ల పలు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఏర్పడిందని ఆరోపించారు. పీఎం మోడీకి ఉన్న విజన్ కొరతే.. దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యలన్నింటీకి మూలమని ట్వీట్ చేశారు కేటీఆర్. కేంద్రం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు ఒక్కటి కూడా లేదన్నారు కేటీఆర్. ఐఐఎస్ఈఆర్‌లు 2 కేటాయిస్తే అందులోనూ రాష్ట్రానికి ఏం లేదని మండిపడ్డారు.
16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఐడీలు 4, మెడికల్ కళాశాలలు 157ల్లోనూ తెలంగాణకు ఏం కేటాయించకపోవడం పక్షపాతం కాదా..? అని ప్రశ్నించారు. 84 నవోదాయల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ట్వీట్ లో పేర్కొన్నారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ హామీని విస్మరించారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.