అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు బలితీసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటన చాలా విషాదకరమని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రతి మున్సిపాలిటీలోనూ వీధికుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇందు కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇక ఇలా ఉంటే ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల కాటుతో బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.
వీధి కుక్కల బెడద నుంచి హైదరాబాద్ ప్రజలను, పిల్లలను కాపాడాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నా చర్యలు తీసుకోకుండా, అసలు జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. గతంలోను ఇటువంటి కేసులు నమోదయ్యాయని.. ఏదైనా ఇష్యూ జరిగితేనే స్పందించి ఆ సమయానికి చర్యలు తీసుకొని తర్వాత దులిపేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల్లో పిచ్చికుక్కలు తిరిగితే పిల్లలు, వృద్ధులు బయట ఎలా తిరగాలని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇకనైనా స్పందించి కుక్కలను అడవుల్లో వదిలేయాలని అన్నారు.