తెలంగాణలో కొత్త పింఛన్ లకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించి ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్ లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్ రాని వారికి ఏప్రిల్ నెల నుంచి నగదు అందజేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి.. కొత్తవి మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు పింఛన్ లు 200 ఇచ్చేదని.. దానిని టీఆర్‌ఎస్ సర్కారు రూ.2 వేలకు పెంచిందని అన్నారు. గతంలో ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా గతంలో లబ్ధిదారులు 29 లక్షల మంది ఉండేవారని కేటీఆర్ తెలిపారు. అదనంగా మరో 11 లక్షల మందితో మొత్తం 40 లక్షల మందికి పింఛన్ అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల కోసమే పనిచేస్తున్న సర్కార్ అంటే కేసీఆర్ సర్కార్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా 10 లక్షల మంది ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ రెండింటి ద్వారా రూ.8,421 కోట్లను కట్నం రూపంలో ఆడబిడ్డలకు అందజేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.