తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే శాసన సభలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్ సీఐ నివేదికలను కూడా నమ్మారా.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని, సద్విమర్శలు చేయండీ కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇటు వైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
అయితే అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదని కేటీఆర్ గొప్ప మాట అన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పన్నుల ద్వారానే నడుస్తాయని, దేశానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నారు.
ధరణి సమస్యలను ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం ఇవ్వకుండా పేదల నుంచి లాక్కుంటుందని ఆయన మండి పడ్డారు. పెట్రోల్ ధరలు పెరిగాయి అన్నారు. రాష్ట్రం పెట్రోల్ పై పన్నులు వేయదా.. అని ఆయన అన్నారు. ప్రభుత్వం జీతాలు మొదటి వారంలో రావడం లేదని, గ్రామ సర్పంచ్ లకు ,కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.