తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్ మిల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని ఫైరయ్యారు.
సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు కేటీఆర్. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా జరుపుతున్నామని వివరించారు. విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు అడుగుతున్నారని.. ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామని ప్రశ్నించారు.
త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు. పాత ఖైదీగా వ్యవహరించడం మాని.. భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. ఇటు ట్విట్టర్ లోనూ అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు కేటీఆర్. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోందని అన్నారు. దీనికి సంబంధించిన పలు పత్రికల్లో వచ్చిన కథనాలు ఇవిగో అంటూ పేపర్ క్లిప్పింగ్ లు షేర్ చేశారు.
అమిత్ షా ఏమన్నారంటే..?
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ భయపడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ ను నిజాం పాలన నుంచి విముక్తి చేసేందుకు పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని కాంగ్రెస్ ఎన్నడూ గుర్తుపెట్టుకోలేదని అన్నారు. గతేడాది తెలంగాణ విమోచన దినోత్స వాన్ని కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా కేంద్రమే అధికారికంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోర్టాలో అమరవీరుల స్మారక చిహ్నం, దేశ మొదటి హోంమంత్రి సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ… హైదరాబాద్ విముక్తి కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ చొరవ తీసుకుని ఉండకపోతే హైదరాబాద్ కు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. అలాగే, బీదర్ కు కూడా స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదని వెల్లడించారు. గరోటా గ్రామస్తుల త్యాగాలను అమిత్ షా ప్రశంసించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు గరోటా గ్రామస్థులను నిజాం సైనికులు హత్య చేశారన్నారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని ఘోరంగా చంపేశారని వివరించారు. ఇప్పుడు అదే గడ్డపై 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని వెల్లడించారు. అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామని చెప్పారు షా.