బీజేపీ లక్ష్యంగా కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. వివాదాస్పదమైన ఢిల్లీ బడ్జెట్ అంశం, బెంగళూరులో నటుడి అరెస్టుకు సంబంధించి విమర్శలు గుప్పించారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడన్న అభియోగాలపై కన్నడ నటుడు చేతన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనను తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు సింక్ చేసి సెటైర్లు వేశారు కేటీఆర్.
‘బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కించపరుస్తూ చేసిన ట్వీట్ కు 14 రోజుల జైలు శిక్ష విధించారు. మరి, మన తెలంగాణలో అంతకంటే దారుణంగా సీఎం, మంత్రులను, శాసనసభ్యులను ప్రత్యక్షంగా, ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తూనే ఉన్నాం. ఇక, అలాంటి వారికి మనం కూడా అదేవిధంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. భావవ్యక్తీకరణ హక్కు అనేది దుర్వినియోగం చేసే హక్కు కాదు. దీనిపై ప్రజలు మీరేమంటారు?’ అంటూ అడిగారు కేటీఆర్.
ఇటు వివాదాస్పదమైన ఢిల్లీ బడ్జెట్ అంశంపైనా ట్వీట్ చేస్తూ.. బీజేపీపై మండిపడ్డారు. కపిల్ సిబల్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన కేటీఆర్.. ‘ఏదైనా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా గెలవకపోతే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. పార్టీని చీల్చడానికి చూస్తారు. ఏదీ పని చేయకపోతే.. కుయుక్తులు పన్నుతారు’ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
మంగళవారం కూడా మెహుల్ చోక్సీ ఇష్యూపై స్పందించిన కేటీఆర్ పలు ప్రశ్నలు వేశారు. ఇంటర్ పోల్ రెడ్ నోటీసు డేటాబేస్ నుంచి చోక్సీని తొలగించడంపై స్పందిస్తూ.. గుజరాత్ లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉందా? అని ప్రశ్నించారు. ‘‘మెహుల్ చోక్సీ భాయ్’’ రాజా సత్య హరిశ్చంద్ర మరొక కజిన్ అంటూ విమర్శించారు. అతడికి స్కాట్-ఫ్రీగా(ఎటువంటి శిక్ష లేకుండా) ప్రయాణించడానికి అనుమతిస్తూ ఎన్వోసీ కూడా ఇచ్చారని ఎద్దేవ చేశారు కేటీఆర్.