వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు రెండు రోజులుగా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భక్తులు రుద్రాభిషేకం, అన్నపూజ, శ్రీస్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొనడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకుంటున్నారు.
ఓవైపు భక్తుల రద్దీ కొనసాగుతుండగా.. ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వేములవాడ ఆలయ అభివృద్ధికి సంబంధించి మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, సంబంధిత అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు కేటీఆర్.
రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేములవాడ గుడి చెరువును వరంగల్ బండ్ తరహాలో నిర్మించనున్నట్లు చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిలవనున్నాయని అన్నారు. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.
వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తామన్న కేటీఆర్… సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు తెలిపారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్, వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కేటీఆర్.