– ఈడీ, మోడీకి భయపడేది లేదు
– ఏం చేసుకుంటారో చేసుకోండి
– మునుగోడులో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే..
– రాజగోపాల్ కాంట్రాక్ట్ పై ప్రమాణానికి సిద్ధమా?
– భాగ్యలక్ష్మి ఆలయంలో బండితోనైనా..
– మేం కట్టిన యాదాద్రి గుడిలో అయినా సరే..
– రాజగోపాల్ కు కేటీఆర్ సవాల్
మునుగోడులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. గోల్‌మాల్ గుజరాత్ మోడల్ తో దేశాన్ని బీజేపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తుంటే తట్టుకోలేని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ నేతలు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను కట్టెబట్టిన మాదిరిగానే.. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలన్నారు కేటీఆర్. అప్పుడు పోటీ నుంచి తప్పుకుంటామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు నెలకొన్న ఫ్లోరోసిస్ పరిస్థితులను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ అని తెలిపారు. ఇవాళ ఇంటింటికీ సురక్షితమైన తాగునీరును అందిస్తున్నామని… మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ ను నిర్మూలించగలిగామని వివరించారు.
మోడీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని అన్నారు కేటీఆర్. గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని.. మోడీ, బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. చావనైనా చస్తాం.. లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరని.. ఆరోపణలు మోడీ మీద కూడా వచ్చాయని గుర్తు చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ పై మండిపడ్డ కేటీఆర్.. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు అని విమర్శించారు. వారిద్దరినీ మోడీ తన బుట్టలో వేసుకున్నారని ఆరోపించారు. ఒకాయనేమో బీజేపీలోకి జొర్రిండు.. అన్ననేమో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుండు అని సెటైర్లు వేశారు. వీళ్లిద్దరూ కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు అని.. ఇలాంటి చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గల్లిగల్లీకి, ఇంటింటికీ ఈ విషయాన్ని చెప్పాలని సూచించారు.
రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు కోరాలని డిమాండ్ చేశారు మంత్రి. బీజేపీ అప్పనంగా వేల కోట్ల కాంట్రాక్ట్ రాసిచ్చిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ కాంట్రాక్ట్ సక్రమమే అయితే.. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బండి సంజయ్ నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం చెయ్.. లేదా తాము కట్టిన యాదాద్రికి వచ్చి మోడీ మీద ప్రమాణం చెయ్ అని సవాల్ విసిరారు కేటీఆర్.