నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిసెంబర్ నెలాఖరు నాటికి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు.
గత 8 నెలలుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు కేటీఆర్. పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 11 ఎకరాల ప్రాంగణంలో మ్యూజియం, పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో విగ్రహ పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు.
హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ పార్క్ దగ్గరలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరుగుతోంది. రూ.150 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు.