ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు మంత్రి కేటీఆర్. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మునుగోడు ప్రచారంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడారు కేటీఆర్. కరోనాను ధైర్యంగా ఎదుర్కొని కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొన్నందుకు మోడీకి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన కేబినెట్ లో సహచర మంత్రులు కూడా తెలివి గల వారని తాను ఒప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు.
కరోనా వ్యాక్సిన్ ఒక్కటే కాదు డీమోనిటైజేషన్, స్విస్ బ్లాక్ మనీ రిటర్న్స్ చేసినందుకు ఆర్థికశాస్త్రంలో కూడా మోడీకి నోబెల్ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు వేశారు.
‘‘ప్రధాని మోడీ నోబెల్ బహుమతికి అర్హులు.. కానీ ఏ కేటగిరీలో ఇవ్వాలి. కోవిడ్ వ్యాక్సిన్ ను కనిపెట్టినందుకా? డీమోనిటైజేషన్, స్విస్ బ్లాక్ మనీ రిటర్న్స్ చేసినందుకా? రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకా? రాడార్ సిద్ధాంతానికి భౌతిక శాస్త్రాంలో ఇవ్వాలా?’’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
ఇక నోబెల్ కంటే విశ్వగురుకి అర్హుడని భావించే బీజేపీ వాళ్లందరూ దీన్ని ఓసారి చూడండి అంటూ మోడీ పాత వీడియోను పోస్ట్ చేశారు కేటీఆర్. ‘‘రూపాయి విలువ తగ్గింపుపై అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలో అద్భుతమైన హిస్ట్రియానిక్స్ అండ్ థియేట్రికల్ స్కిల్స్ లో మోడీ జీని నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని కొటేషన్ పెట్టారు.