కేబినెట్ కూర్పులో యువరాజ ముద్ర
సీనియర్ల గుర్రు
అన్ని జిల్లాల్లో రగులుతున్న అసంతృప్తి
హైదరాబాద్: కేటీఆర్ మొదటి నుంచి కేసీఆర్ సన్నిహితులను దూరం పెడుతున్నారన్న భావన పార్టీలో ఉంది. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉన్న SRSP నేతల్ని పక్కకు పంపాలన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నారట. SRSP అంటే సుభాష్ రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి. వీరితో పాటు, పార్టీలో, సీనియర్‌లని బలహీనపరిచే పనిలో కేటీఆర్ వున్నారని, తన మార్క్ కాబినెట్‌కు, భవిష్యత్తులో తన మార్క్ ప్రభుత్వానికి ఆయన అంకురార్పణ చేస్తున్నారని కారు బాబులు చెప్తున్నారు. మరి తన మార్క్ కాబినెట్‌గా కేటీఆర్ చేసిన ఎంపికపై పార్టీలో పరిస్థితి ఏమిటి?
ముందుగా ఖమ్మం జిల్లా చూస్తే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తుమ్మల అసంతృప్తిలో ఉన్నారు. నిన్నకాక మొన్న పార్టీలో చేరిన సండ్ర వెంకట వీరయ్య కూడా బాధపడుతున్నారు. మంత్రి పదవి దక్కించుకున్న అజయ్ అహంకారపూర్వకంగా వ్యవహరిస్తారని ఖమ్మం పార్టీ నేతలు బాధపడుతున్నారు. అజయ్‌కి కేటీఆర్ వల్లే పదవి వచ్చిందని, స్థానిక నేతల ఆమోదం తక్కువని వారంటున్నారు.
మహబూబ్ నగర్‌లో తనను ఎందుకు పక్కన పెట్టారో అర్ధంకాలేదంటూ లక్ష్మారెడ్డి బాధపడుతున్నారు. సీనియర్‌లకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
వరంగల్‌లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణా పోరాటంలో ఎంత కృషి చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఎంపీ నుంచి ఉపముఖ్యమంత్రి అయిన కడియం పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వరంగల్ జిల్లాలో వినయ్‌భాస్కర్, రెడ్యానాయక్ కూడా అసంతృప్తిని, ఆగ్రహాన్ని సన్నిహితుల దగ్గర వెళ్ళగక్కుతున్నారు.
నల్గొండలో పల్లా రాజేశ్వర్ రెడ్ట్ అలకపాన్పు మీద ఉన్నారు. విప్ పదవి కూడా పోయి, పార్టీలో పనిచేసిన వారికి మీరిచ్చే కానుక ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
నిజామాబాద్‌లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. తనకు, తన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని బాజిరెడ్డి భావన.
ఆదిలాబాద్‌లో గతంలో మంత్రిగా పనిచేసిన జోగురామన్న కూడా బాధలో ఉన్నారు. తనకు అన్యాయం చేశారని రాజకీయ సహచరులకు చెప్పుకున్నారు.
హైదరాబాద్‌లో పద్మారావు ఇప్పటికే ఎవ్వరికీ కనపడకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఆయన అనుచరులు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ విప్ పదవి వద్దని, మంత్రి పదవి ఇవ్వనందుకు అసంతృప్తిగా ఉన్నానని కనపడినవారందరికీ చెప్పుకుంటున్నారు.
ఇక, పార్టీ సీనియర్ పద్మ దేవేందర్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదనే దాని కంటే, జూనియర్ సబితా ఇంద్రారెడ్డికి పదవి ఇచ్చారనే బాధలో ఉన్నారు.
సీనియర్‌లను మెల్లగా సాగనంపడం, తనకు అనుకూలంగా ఉన్నవారిని అందలం ఎక్కించడం కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అసంతృప్తి రాగాన్ని ఆలపిస్తున్న సీనియర్‌లు అక్కడితో ఆగిపోతారని, అసమ్మతి రాగం ఆలపించే అవకాశం లేదని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు.
మరోపక్క హరీష్‌రావుకి ఆర్ధికశాఖ ఇవ్వడం ద్వారా జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉండదని, పార్టీలో కూడా హరీష్ కీలకపాత్ర పోషించే అవకాశం శూన్యమని కేటీఆర్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, ‘రసమయి’ బాలకిషన్, మరో ఇద్దరు సీనియర్లు నాయిని నర్సింహారెడ్డి, రాజయ్య తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేస్తే, మంత్రివర్గంలో అసలు మాదిగలు లేరే లేరని రాజయ్య మండిపడ్డారు. ఇంటికి తామంతా ఓనర్లమేనని, కిరాయిదార్లు ఎంతకాలం వుంటారో వాళ్లిష్టమని నాయిని అనడం కొసమెరుపు.
మొత్తం మీద ఇంతకాలం ఎదురుచూసిన మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో ఎటువంటి మార్పులకి నాంది పలుకుతుందోనని నేతలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.