నాగార్జున సాగర్ గెలుపు కోసం చాలా రోజుల నుండే టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. కేసీఆర్ సాగర్ లో పర్యటించి వచ్చాక మండలానికో ఇంచార్జ్ లను వేసి ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది. సాగర్ లో జానారెడ్డి వంటి నాయకున్ని ఎదుర్కొని గెలవాలంటే అన్ని శక్తులు మొహరించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నేతలంతా సాగర్ లో వాలిపోయారు.
అయితే, నాగార్జున సాగర్ ను కేటీఆర్ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఇంచార్జ్ లుగా ఉన్న ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కోనేరు కోనప్పతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావులు సాగర్ లోనే మకాం వేశారు. బాల్క సుమన్ సోషల్ మీడియా ప్రచారంతో పాటు ప్రచారాన్ని కూడా చూస్తుండగా… మిగిలిన ఎమ్మెల్యేలు ప్రచార జోరు పెంచారు.
జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతలెవరూ ఇంకా సాగర్ లో యాక్టివ్ గా లేరు. కానీ మంత్రి కేటీఆర్ టీంగా ముద్రపడ్డ వారు మాత్రం సాగర్ ను చుట్టేస్తూ, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు కేటీఆర్ కు, కేసీఆర్ కు చేరవేస్తుండటం టీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది.
సాగర్ ఉప ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకునే అవకాశం ఉందని, అందుకే తన నమ్మకమైన టీంను అక్కడకు పంపి… స్థానిక పరిస్థితులను బేరీజు వేస్తున్నారని, అసెంబ్లీ సమావేశాలు పూర్తవ్వగానే కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి… ప్రతి మండల కేంద్రాన్ని చుట్టివచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులంటున్నాయి.