బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని మంత్రి కేటీఆర్ అన్నారు. వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. నాయకులందరి మధ్య ఆత్మీయ అనుబంధం బలోపేతం కావాలని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమాల బాధ్యత ఎమ్మెల్యేలకు ఆయన అప్పగించారు. గ్రామాలను యూనిట్లుగా తీసుకుని ఈ సమావేశాలు నిర్వహించాలన్నారు.
ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా గుర్తించి పార్టీ సభ్యులతో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పట్టణాల విషయానికి వస్తే ఒక్కో పట్టణాన్ని, పెద్ద నగరాల్లో అయితే డివిజన్లను కలుపుకుని సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.
ఈ సమావేశాల విషయంలో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను కార్పొరేషన్ ఛైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ తదితర పార్టీ ముఖ్య నేతలను కూడా కలుపుకొని పోవాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ సమ్మేళనాలు పూర్తికావాలన్నారు.
సమావేశాలను ఏ రోజు, ఎక్కడ, ఏ యూనిట్‌లో నిర్వహిస్తున్నారనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలని ఆయన చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి వాటన్నింటినీ పూర్తి చేయాలన్నారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. వచ్చే నెల 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ దిశగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా పలు కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు.